Gau rakshak shot in Pocharam | హైదరాబాద్ శివారు ఘట్కేసర్ సమీపంలోని పోచారం ఐటీ కారిడార్ వద్ద కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపింది. ఇబ్రహీం అనే వ్యక్తి సోనుసింగ్ అలియాస్ ప్రశాంత్ పై కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగారు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కీసర మండలం రాంపల్లికి చెందిన సోనుసింగ్ గో సంరక్షకుడు. ఇతర ప్రాంతాల నుంచి జరిగే గో అక్రమ రవాణాను అడ్డుకుంటారు. అక్రమ రవాణా చేసే వాహనాలను గుర్తించి హిందు సంఘాలకు సమాచారం చేర వేస్తాడు. కొద్దిరోజుల క్రితం వరంగల్ నుంచి వస్తున్న ఓ వాహనాన్ని సోను కారులో వెంబడించారు. లారీ డ్రైవర్ తో వాగ్వాదం పెట్టుకున్నారు. అయితే లారీ డ్రైవర్ మాత్రం బ్యారికేడ్లను ఢీ కొట్టి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో ఇబ్రహీం అనే వ్యక్తి బుధవారం పోచారం చేరుకుని సోను వెళ్తున్న కారును వెంబడించి ఆపాడు. గోవులను తరలిస్తున్న వాహనాలను ఎందుకు ఆపుతున్నావ్ అంటూ గొడవకు దిగాడు. అనంతరం ఇరువురు తోసుకున్నారు.
ఇదే సమయంలో ఇబ్రహీం తన తుపాకిని తీసి రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సోనును స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోను పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ సోనును పరామర్శించారు. అలాగే రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ కూడా సోనును ఆసుపత్రిలో పరామర్శించారు. ఇబ్రహీం అనే వ్యక్తి ఎంఐఎం కార్యకర్త అని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎంఐఎం ఆగడాలు పెరిగిపోయాయని, గోసంరక్షకులపై దాడులు పెరిగిపోయాయని కాషాయ నేతలు ఆరోపించారు.










