Former CBI JD Lakshminarayana’s Wife Duped For Rs 2.58 cr By Cyber Criminals | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారు చెప్పే మాయ మాటలకు, పన్నాగాలకు అమాయకులే కాకుండా ఉన్నత చదువులు చదివి సమాజంపై అవగాహన ఉన్నవారు కూడా మోసపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. భర్త సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, ఇలాంటి మోసాలపై అవగాహన ఉండే ఉంటుంది. అయినప్పటికీ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ ఉచ్చులో చిక్కుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. స్టాక్ మార్కెట్ లో అధిక లాభాలు వస్తాయని కేటుగాళ్లు వేసిన వలలో చిక్కి రూ.2.58 కోట్లు పోగొట్టుకున్నారు లక్ష్మీనారాయణ సతీమణి ఊర్మిల.
తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అత్యధిక లాభాలు వస్తాయని ఊర్మిళ వాట్సప్‌కు గతేడాది ఓ అపరిమిత నంబర్ నుండి సందేశం వచ్చింది. ట్రేడింగ్‌పై పెద్దగా అవగాహన లేని ఊర్మిళ.. ఆ మాటలను నమ్మి ‘స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్సేంజ్ 20’ అనే వాట్సాప్ గ్రూపులో చేరారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి దినేష్ సింగ్ అనే వ్యక్తి.. తనని తాను ఐఐటీ ముంబై గ్రాడ్యుయేట్‌గా, అమెరికాలో పీహెచ్‌డీ చేసిన విద్యావంతుడిగా పరిచయం చేసుకున్నాడు. త్వరలో తాను రాసిన ‘స్టాక్ మార్కెట్ ట్రెజర్ హంటింగ్ సీక్రెట్స్’ అనే పుస్తకం విడుదల కాబోతోందని నమ్మబలికాడు. ఊర్మిళకు ట్రేడింగ్‌పై అవగాహన లేకపోవడంతో, మాయ మాటలు చెప్పి కొన్ని స్క్రీన్ షాట్లు పంపి తాను చెప్పిన విధంగా పెడితే 500% లాభాలు వస్తాయని దినేష్ సింగ్ నమ్మించాడు. దినేష్ సింగ్ మెసేజ్స్‌ను బలపరుస్తూ తనకు నిజంగానే లాభాలు వచ్చాయని గ్రూప్‌లో ప్రియసఖి అనే మహిళ స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు.
అయితే ఆమె కూడా ముఠాలోని సభ్యురాలే. దీంతో వీళ్ల మాయ మాటలు నమ్మి కేటుగాళ్ళు చెప్పిన అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకొని.. డిసెంబర్ 24 నుండి జనవరి 5 మధ్యలో రూ.2.58 కోట్ల పెట్టుబడులు పెట్టారు ఊర్మిల. ఇందుకోసం తన వద్ద ఉన్న బంగారంతో పాటు, భర్త లక్ష్మీనారాయణ దగ్గర ఉన్న బంగారం కూడా తనఖా పెట్టడం గమనార్హం. అనంతరం యాప్‌లో లాభాలు కనిపించినా విత్ డ్రా ఆప్షన్ కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాలకు డబ్బులు పంపించారని, వాటిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు పేర్కొన్నారు.









