Explosion at fireworks manufacturing unit in Anakapalle | అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సంభవించిన పేలుడు ఘటనలో ఇప్పటివరకు ఎనమిది మంది మృతిచెందడం తీవ్ర విషాదం నింపింది.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కార్మికులు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై విచారణ చేసి నివేదించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మరోవైపు అగ్నిప్రమాదం ఘటన గురించి తెలుసుకున్న హోంమంత్రి అనిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు.