- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
- శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ నేతలు
Ex PM Manmohan Singh | భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. కాగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
మన్మోహన్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహ కేంద్ర మంత్రులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేతలంతా మన్మోహన్ సింగ్ కు అంజలి ఘటించారు.
1932 సెప్టెంబరు 26న అవిభాజ్య భారత్ లోని పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది)లో జన్మించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పట్టా పొందారు. 1958 సెప్టెంబరు 14న గురుశరణ్ కౌర్ ను వివాహమాడారు. వీరికి ఉపిందర్ సింగ్, అమృత్ సింగ్, దామన్ సింగ్ ముగ్గురు కుమార్తెలు.
కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్, ఆక్స్ ఫర్డ్ నుంచి ఎం.ఎ. డి.ఫిల్ , హోనరిస్ కాసా నుంచి డి.లిట్ పూర్తి చేశారు.
1957-59 ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులుగా, 1963-65 మధ్య పంజాబ్ వర్సిటీలో ప్రొఫెసర్ గా, 1968-69 యూఎన్ఓలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా విధులు నిర్వహించారు. 1969-71 దిల్లీ వర్సిటీ, అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్ గా పనిచేశారు.
1972-76 మధ్య కాలంలో ఆర్థికశాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 1976-80 రిజర్వు బ్యాంకు డైరెక్టర్, ఐడీబీఐ డైరెక్టర్, ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత్ విభాగం గవర్నర్, ఐబీఆర్డీ భారత విభాగం గవర్నర్, 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్ గా కీలక బాధ్యతలు నిర్వహించారు.
ఆర్థిక సంస్కరణలు..
దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్.. అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు నెలకొల్పారు.
అత్యధిక జీడీపీ..
ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలో అత్యధిక జీడీపీ (10.8 శాతం) వృద్ధిరేటు నమోదైంది. ఆయన హయాలోనే వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది. 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు.
ఆయన సేవలకు గుర్తింపుగా 1987లో మన్మోహన్ కు పద్మవిభూషణ్ ప్రదానం చేసింది భారత ప్రభుత్వం. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి కూడా అందుకున్నారు.