EAM Jaishankar attends Khaleda Zia’s funeral | బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని, దశాబ్దాల పాటు ఆ దేశ రాజకీయాలను శాసించిన బేగం ఖాలిదా జియా మంగళవారం మృతి చెందారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె 80 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. బుధవారం బంగ్లా రాజధాని డాకాలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు, ఖాలిదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ను జైశంకర్ కలిశారు. సుమారు 17 ఏళ్ల ప్రవాసం తర్వాత తారిఖ్ రెహ్మాన్ ఇటీవలే బంగ్లాకు తిరిగివెళ్లారు.
భారత ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున ఖాలిదా మృతి పట్ల జైశంకర్ సానుభూతి తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేస్తూ రాసిన లేఖను అందజేశారు. ఖాలిదా జియా మృతి నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినం ప్రకటించింది. ఇకపోతే త్వరలో జరగబోయే బంగ్లా ఎన్నికల్లో ఖాలిదా పార్టీ విజయం సాధిస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఆ దేశంలో మైనార్టీలు అయిన హిందువులపై దాడులు అధికం అవ్వడం ఆందోళన కలిగించే విషయం.









