Dharmapuri Arvind On Kerala Liquor Scam | కేరళ రాష్ట్రంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని దీని వెనుక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు కేరళ అసెంబ్లీ విపక్ష కాంగ్రెస్ నేత వీడీ సతీషన్ ( V. D. Satheesan ).
ఈ మేరకు గురువారం పాలక్కడ్ ( Palakkad ) లో మీడియా సమావేశం నిర్వహించారు. 2023లోనే ఈ వ్యవహారం జరిగినట్లు చెప్పారు. ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున కవిత ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్లు ఈ కాంగ్రెస్ నేత ఆరోపించారు.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకులు ధర్మపురి అర్వింద్ ( Dharmapuri Arvind ) స్పందించారు. ‘నాకు మలయాళం అర్ధం కాదు…ఈ కేరళ నాయకుడు చెప్పేది మీకెవళ్ళకైనా అర్ధం అయితే చెప్పండి!! కేరళలో కూడా మన లిక్కర్ కీర్తి పతాక ఎగిరినట్టుంది’ అంటూ ఎంపీ అర్వింద్ కాంగ్రెస్ నాయకుడు చేసిన ఆరోపణలు వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా Pablo Es ‘k’ Bar అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరోవైపు కేరళ లిక్కర్ స్కామ్ ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత ( Kavitha Kalvakuntla ) తీవ్రంగా ఖండించారు. ఇది కాంగ్రెస్ నీచ రాజకీయాలకు నిదర్శమని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.