Cyclone Montha | పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆ తర్వాత తుఫాన్ గా మారి ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకువచ్చింది. దీనికి ‘మొంథా’ అని నామకరణం చేశారు. మొంథా ధాటికి ఏపీలోని తీర ప్రాంతాల్లో తీవ్ర అలజడి నెలకొంది.
ఈదురుగాలులు, భారీ వర్షాలు, రాకాసి అలలు ఇలా మొంథా బీభత్సం సృష్టించింది. ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి 11.30 నిమిషాల నుంచి 12.30 నిమిషాల మధ్య పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద భయంకర మొంథా తీరం దాటింది. ఈ విషయాన్ని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం మధ్యాహ్నం నాటికి భూభాగం పైనే ఈ తుఫాన్ బలహీనపడనుంది.
ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ఛత్తీస్ ఘడ్ చేరుకోనున్న మొంథా క్రమంగా బలహీన పడనుంది. తీరం దాటే సమయంలో మొంథా గంటకు 12 కి.మీ. వేగంతో ముందుకు సాగింది. ఈ సమయంలో 80 నుంచి 95 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. తీరం దాటినప్పటికీ మొంథా ప్రభావం మూలంగా ఏపీతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి.









