Consumer Panel Issues Non-Bailable Warrants to Amazon Andhra Pradesh | ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కర్నూలు లోని వినియోగదారుల ఫోరం. కర్నూల్ జిల్లా సి.బెళగల్ గ్రామానికి చెందిన వీరేశ్ అనే వ్యక్తి అమెజాన్ లో గతేడాది సెప్టెంబర్ నెలలో రూ.79,900 చెల్లించి ఐ ఫోన్ 15 ప్లేస్ సెల్ ఫోన్ ను ఆర్డర్ చేశారు.
కానీ అమెజాన్ మాత్రం ఐ ఫోన్ బదులు ఐకూ ఫోన్ ను డెలివరీ చేసింది. ఈ క్రమంలో వినియోగదారుడు కస్టమర్ కేర్ ను సంప్రదించగా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వీరేశ్ కర్నూలు లోని వినియోగదారుల ఫోరంను సంప్రదించారు. విచారణ చేపట్టిన కమిషన్ అమెజాన్ ఎండీతో పాటు మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. అయితే వారు నోటీసులను ఖాతరు చేయలేదు.
దింతో ఫిర్యాదుదారుడు ఐ ఫోన్ కోసం చెల్లించిన రూ.79900 లకు 12 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని అలాగే వినియోగదారుడు పడిన మానసిక ఆవేదనకు, కోర్టు ఖర్చుల నిమిత్తం అదనంగా రూ.35 వేలు చెల్లించాలని స్పష్టం చేస్తూ ఫోరం నోటీసులు జారీ చేసింది. కానీ అమెజాన్ తరఫున మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కన్స్యూమర్ ఫోరం అమెజాన్ ఎండీతో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసి తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది.









