CM Revanth Orders To TSPSC | తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో వేగం పెంచారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీల్లోని రెండు పథకాలను అమలు చేశారు.
రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి, కరెంట్ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ అధికారులను ఉరుకులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలపై తీవ్రంగా ప్రభావం చూపిన ఉద్యోగ నోటిఫికేషన్లపై దృష్టిసారించారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ అంశంపై రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు.. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకోని రివ్యూ మీటింగ్‌కు హాజరుకావాలని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ ఏర్పడిన 2014 ఏడాది నుంచి టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు, నోటిఫికేషన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలతో సమీక్షకు రావాలని సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో అతి త్వరలో నిరుద్యోగులకు శుభవార్త అందొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.