Cm Revanth On Kavitha Comments | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లొంగిపోయారని కవిత తాజగా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అలాగే హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో కవిత ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజలు తిరస్కరించిన వారి వెనుకాల తాను ఎందుకు ఉంటానన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులు విపరీతంగా వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబంలో పంపకాల విషయంలో విభేదాలు వచ్చాయని విమర్శలు గుప్పించారు.
కవిత వెనుకాల తాను ఉన్నానని ఒకరు అంటుంటే హరీష్, సంతోష్ వెనకాల సీఎం ఉన్నారని కవిత అంటున్నారని పేర్కొన్నారు. కానీ తెలంగాణ ప్రజలు తిరస్కరించిన వారి వెనుకాల బుద్ధి ఉన్నవారు ఎవరైనా ఉంటారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల వెంట మాత్రమే తాను ఉంటానని చెప్పారు. కుల, కుటుంబ పంచాయితీల మధ్యలోకి తనను తీసుకురావద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.









