Clash at Gali Janardhan Reddy’s House | కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నగరంలో గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి వర్గం మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో ఈ ఘటన చోటుచేసుకుంది. బళ్లారిలోని ఎస్పీ సర్కిల్ లో శనివారం మహర్షి వాల్మీకి విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. ఈ క్రమంలో నగరం అంతా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద కూడా ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి బ్యానర్లు కట్టిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అయితే ఇదే సమయంలో జనార్దన్ రెడ్డి అక్కడికి వచ్చారు. ఆయన్ను చూసిన వెంటనే సతీష్ రెడ్డి గన్మెన్ వద్ద ఉన్న తుపాకీ లాక్కొని కాల్పులకు పాల్పడ్డట్లు స్థానిక మీడియా పేర్కొంది. తృటిలో జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. అనంతరం ఇరు వర్గాలు రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో గన్మెన్లు కాల్పులు జరిపారు. దింతో భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఒకరు మృతి చెందారు. ప్రస్తుత పరిస్థితులు నేపథ్యంలో బళ్లారిలో హైటెన్షన్ నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.









