KTR Explanation on His comments | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోషల్ మీడియా వేదికగా తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటని ఇటీవల మంత్రి సీతక్క (Seethakka) కామెంట్ చేశారు.
ఆ వ్యాఖ్యలపై కేటీఆర్ బుధవారం స్పందిస్తూ బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే రికార్డింగ్ డ్యాన్సులు, బ్రేకు డ్యాన్సులు వేసుకోవచ్చునన్నారు. కాకపోతే సరిపడా బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల దాడులు కూడా చేసుకుంటున్నారని కామెంట్లు చేశారు.
అయితే కేటీఆర్ చేసిన కామెంట్లను తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Women Commission) సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించింది. కేటీఆర్ కామెంట్లు తెలంగాణ మహిళలను అగౌరవపరిచేలా, కించపరిచేలా ఉన్నాయని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద ట్వీట్ చేసారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన కామెంట్లపై వివరణ ఇచ్చారు.
‘నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.