Teegala Krishna Reddy | కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది.
బీఆరెస్ పార్టీలోని కీలక నేతలైన పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు హస్తం గూటికి చేరబోతున్నారు.
వీరితోపాటు పలు నియోజకవర్గాలకు చెందిన దాదాపు 33 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా జీహెచ్ఎంసీలో బీఆరెస్ పార్టీకి చెందిన కీలక నేత కూడా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే కారు దిగడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.
ఆయన మరెవరో కాదు గతంలో హైదరాబాద్ కు మేయర్ గా, ఎమ్మెల్యేగా పనిచేసిన కీలక నేత తీగల కృష్ణారెడ్డి.
ఓ ప్రధాన మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు తనకు చివరివనీ, కేసీఆర్ గారు టికెట్ ఇవ్వకపోతే తన దారి చూసుకుంటానని తేల్చి చెప్పారు.
2014 లో టీడీపీ నుండి గెలిచి కేసీఆర్ పిలుపు మేరకు టీఆరెస్ లో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశానన్నారు.
కానీ 2018 లో తనపై కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకొని మంత్రి పదవిని ఇచ్చినా సహకరించానన్నారు.
కానీ పార్టీ అధిష్టానం తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అసహనాన్ని వ్యక్తపరిచారు. ఏనాడూ పార్టీ కార్యక్రమాలకు తనని పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: అది ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్.. సీఎం కేసీఆర్ పై షర్మిల సెటైర్లు!
మహేశ్వరం నుంచి గెలిచి, మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా..
తమ కుటుంబానిది స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్ర అని తెలిపారు. తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నానని వివరించారు.
నియోజకవర్గoలో జరిగిన అభివృద్ధి అంతా తన హాయాంలో జరిగిందేనన్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలనీ, అందుకే పార్టీ సీనియర్ నాయకులు అధిష్టానం తో చర్చించి తనకు టికెట్ ఇప్పించాలని కోరారు.
కారు దిగడం ఖాయం..
ఈసారి బీఆరెస్ నుంచి టికెట్ రాకపోతే పార్టీ మారాలని కార్యకర్తలు, అనుచరుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని తెలిపారు తీగల కృష్ణారెడ్డి. టికెట్ రాని పక్షంలో తాను కారు దిగడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.
టీడీపీ నుంచి..
తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ లో తన రాజకీయం ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 2002 నుండి 2007 వరకు హైదరాబాద్ మేయర్ గా పని చేశారు.
2014 లో టీడీపీ టికెట్ తో మహేశ్వరం నుంచి పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డిపై విజయం సాధించారు.
బీఆరెస్ లో చేరిన తొలి టీడీపీ ఎమ్మెల్యే..
2014లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్ పిలుపు మేరకు తీగల బీఆరెస్ లో చేరారు.
టీడీపీ నుండి టీఆరెస్ లో చేరిన మొదటి టీడీపీ ఎమ్మెల్యే గా అప్పుడు వార్తల్లో నిలిచారు.
తర్వాత జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో పరాభవం చవిచూశారు.
కానీ అనూహ్యంగా సబితా ఇంద్రారెడ్డి టీఆరెస్ లో చేరి, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
దీంతో నియోజక వర్గంలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీఆరెస్ పార్టీ పైన తన అసంతృప్తి ని వెళ్లగక్కారు తీగల.
మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. టికెట్ రాకపోతే తీగల కాంగ్రెస్ వైపు వెళతారా, బీజేపీలో చేరతారా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.