Bathukamma Kunta News | హైదరాబాద్ అంబర్పెటలోని బతుకమ్మ కుంటకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు పేరును నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
బతుకమ్మకుంటను కాపాడాలని ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్న హనుమంత రావు పేరును బతుకమ్మకుంటకు నామకరణం చేయడానికి అధికారులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం బతుకమ్మ కుంట వద్ద జరిగిన బతుకమ్మ సంబరాల్లో సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బతుకమ్మకుంట నీటిలో ముఖ్యమంత్రి బతుకమ్మను వదిలి గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ కుంటకు ప్రజలకు అంకితమిచ్చారు. బతుకమ్మ కుంటలోని ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించిన విషయం తెల్సిందే. అనంతరం రూ.7.15 కోట్లతో ఆధునీకరణ పనులు చేశారు.









