Bandi challenges Asaduddin Owaisi to make a woman AIMIM chief | హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం షోలాపూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఒవైసీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ..హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు కచ్చితంగా దేశ ప్రధానమంత్రి అవుతారని అది తన కల అని పేర్కొన్నారు. మతంతో సంబంధం లేకుండా దేశ పౌరులు అత్యున్నత పదవుల్లో కూర్చునే అధికారం రాజ్యాంగం కల్పించిందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. హిజాబ్ ధరించిన మహిళను ప్రధానమంత్రిగా కలలు కనే ముందు ఒక మహిళను ఏఐఎంఐఎం అధ్యక్షురాలిగా చేసే ధైర్యం చేయాలని సవాల్ విసిరారు.
ఎంఐఎం పార్టీ ఎంతమంది మహిళలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చిందని నిలదీశారు. 2018 ఎన్నికల్లో అక్బరుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా బీజేపీ ఓ ముస్లిం మహిళా అభ్యర్థిని నిలబెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ..ఆమెను ఎంఐఎం నేతలు బెదిరింపు, లక్ష్యం చేసుకోవడంతో ఓడిపోయినట్లు చెప్పారు. మతం ఏదైనా బీజేపీ మహిళలకు సాధికారతనిస్తుందని మరోవైపు ఒవైసీ మాత్రం పార్టీలో, ప్రజా జీవితం చివరకు ఇంట్లో కూడా మహిళలపై పరిమితులు విధిస్తారని మండిపడ్డారు.









