Anthony Albanese Marries Longtime Parrtner | ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని అల్బనీస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితురాలు జోడీ హైడన్ తో శనివారం మధ్యాహ్నం పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రధాని సోషల్ మీడియాలో వివాహ వేడుక వీడియోను పంచుకున్నారు. అల్బనీస్ తన భార్యకు 2019లో విడాకులు ఇచ్చారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. 2019లోనే డిన్నర్ పార్టీలో హైడన్ తో అల్బనీస్ కు పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారింది.
సుమారు ఆరేళ్ళ పాటు ఈ జంట డేటింగ్ లో ఉంది. తాజగా పెళ్లితో ఒక్కటయ్యింది. అల్బనీస్ వయసు 62 ఏళ్ళు కాగా, హైడన్ ది 46 ఏళ్ళు. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా లోని ప్రధాని అధికారిక నివాసం అయిన ‘ది లాడ్జ్’ తోటలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ వివాహ కార్యక్రమం జరిగింది. కాగా ప్రధాని హోదాలో వివాహం చేసుకున్న తొలి వ్యక్తిగా అల్బనీస్ నిలిచారు. ఇకపోతే 2025 మేలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అల్బనీస్ ప్రధానిగా ఎన్నికైన విషయం తెలిసిందే.









