Friday 18th October 2024
12:07:03 PM
Home > తెలంగాణ > మజ్లీస్ 40 స్థానాల్లో పోటీ.. ఎవరికి నష్టం, ఎవరికి లాభం!

మజ్లీస్ 40 స్థానాల్లో పోటీ.. ఎవరికి నష్టం, ఎవరికి లాభం!

aimim party

AIMIM Party | హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు (Hyderabad MP), ఏఐఎంఐఎం (AIMIM) పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశారు.

సోమవారం బోధన్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తమ మద్దతుతో గెలిచిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ (MLA Shakeel) ఇప్పుడు తమ పార్టీ నాయకులపైనే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు.

డిసెంబర్ 2023 లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బోధన్ ఎమ్మెల్యే కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆ ఎన్నికల్లో షకీల్ ను ఓడించాలని తన పార్టీ కార్యకర్తలని ఉద్దేశించి పిలుపునిచ్చాడు.

అలాగే బీఆరెస్ కు తాము కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం ఎదుగుతామని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

బోధన్ లో ఎంఐఎం అధినేత (AIMIM) చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకుల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

వచ్చే శాసన సభ ఎన్నికల్లో  తెలంగాణలో ఎంఐఎం పార్టీ కనీసం 40 స్థానాల్లో పోటీచేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఎంఐఎం పార్టీ 2014 లో తెలంగాణ లో 20 స్థానాల్లో పోటీ చేసి కేవలం 7 స్థానాల్లో  మాత్రమే విజయం సాధించింది.

తర్వాత టీఆరెస్ పార్టీ తో అవగాహన ఏర్పడి ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్నేహ పూర్వకంగా మెలుగుతున్నారు.

అందుకే మళ్ళీ 2018 లో కేవలం 8 స్థానాల్లోనే పోటీ చేశారు. ఇలా తెలంగాణలో మరియు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీతో సఖ్యతగా మెలిగి ఎంఐఎం పార్టీ కంచుకోట అయిన పాతబస్తీ ని కాపాడుకుంటూ వస్తోంది.

వ్యాఖ్యల వెనుక ఆంతర్యం..

హైదరాబాద్ లో ఆవిర్భవించిన ఎంఐఎం పార్టీ పాతబస్తీ దాటి తెలంగాణ వ్యాప్తంగా ఎన్నడూ పోటీ చెయ్యలేదు.

ఇందుకు పూర్తి భిన్నంగా దేశం లోని ఇతర రాష్ట్రాలు అయిన బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఇలా ఇతర రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చెయ్యడానికి ఒవైసి ఆసక్తి కనబరిచారు.

ఇలా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసి అక్కడి ప్రాంతీయ పార్టీకి లేదా కాంగ్రెస్ పార్టీ కి రావాల్సిన ముస్లిం ఓటును తన వైపు తిప్పుకోంటోంది.

తద్వారా పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుస్తున్నారని ప్రతిపక్షాలు ఎంఐఎం పార్టీని బీజేపీ బి-టీం గా ఆరోపిస్తుంటారు.

కానీ తెలంగాణ విషయానికి వస్తే తన పార్టీ పాతబస్తీ లో మాత్రమే పోటీ చేయడం ద్వారా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఉండే ముస్లిం ఓటును అధికార పార్టీకి బదిలీ చేస్తుంది అనే ఆరోపణలున్నాయి.

ఇలాంటి ఆరోపణలని అబద్ధమని నిరూపించడానికే తెలంగాణ వ్యాప్తంగా పోటీ చెయ్యడానికి ఒవైసి సిద్ధం అయినట్లు తెలుస్తుంది.

బీఆరెస్ పార్టీ బీజేపీకి బి టీం లాగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలు కూడా ప్రస్తావిస్తున్నాయి.

అదేవిధంగా కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో ముస్లిం ఓటు కాంగ్రెస్ వైపు చూసున్నారు. ఇలాంటి సమయం లో బీఆరెస్ కు మద్దతు ఇస్తే తమ పార్టీకీ కూడా నష్టం తీసుకువస్తుందని ఒవైసీ అంచనా వేస్తున్నట్టు సమాచారం.

అలాగే కనీసం 40 స్థానాల్లో పోటీ చేసి అత్యధిక సీట్లు గెలిచి తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రభలమైన శక్తిగా ఎదగాలనే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం.

ఎక్కడ పోటీ చేస్తారో..

తెలంగాణ లో కనీసం 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చెయ్యాలని ఒవైసీ భావిస్తున్నట్లు సమాచారం.  

ఎంఐఎం కచ్చితంగా ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న చోటే పోటీ చేస్తుంది. తెలంగాణలో 29 నియోజకవర్గాల్లో 15 శాతానికి మించి ముస్లిం ఓటర్లు ఉన్నట్లు అంచనా.

మరో 11-14 అసెంబ్లీ స్థానాల్లో 10 నుంచి 14 శాతం వరకు ముస్లిం ఓటర్లు ఉన్నట్లు మజ్లీస్ నేతలు చెబుతున్నారు.

ఇలా 29 స్థానాల్లో ముస్లింలు ఏ పార్టీ వైపు మల్లితే ఆ పార్టీ విజయం సాధిస్తుంది. అలాగే మరో 14 స్థానాల్లో ముస్లింలు గెలుపుఓటములని నిర్ణయిస్తారు అని మజ్లీస్ నేతలు భావిస్తున్నారు.

అందులో పాతబస్తీలోని అన్ని స్థానాలతో పాటుగా రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, సికింద్రాబాద్, అంబర్పేట్, ఉప్పల్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, భువనగిరి, నల్గొండ,

హుజుర్నగర్, కోదాడ, వరంగల్, నిజామాబాద్(అర్బన్), బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, కోరుట్ల,

జగిత్యాల, మహబూబ్ నగర్, వనపర్తి, మక్తల్, సంగారెడ్డి, పోటీ చేయడానికి మజ్లీస్ ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం.

ఎవరికి లాభం, ఎవరికి నష్టం?

తెలంగాణ లో 40 స్థానాల్లో మజ్లీస్ పోటీ చేయడం ద్వారా ఎవరికి లాభం ఎవరికి నష్టం జరుగుతుంది అనే చర్చ జోరుగా పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది.

ముస్లిం ఓటు ప్రధానంగా బీఆరెస్ వైపు ఉన్నదని, దానికి ప్రధాన కారణం మజ్లీస్ తో మైత్రి, షాది ముబారక్, రంజాన్ తోఫా ఇలా పథకాలు మాత్రమే.

ఇవే కాకుండా కాకుండా బీజేపీ పైన వ్యతిరేకంగా పోరాడుతున్నందున ముస్లింలు బీఆరెస్ వైపే ఉన్నారని రాజకీయ విశ్లేషకుల అంచనా.  

ఒకవేళ మజ్లీస్ 40 స్థానాల్లో పోటీ చేస్తే బీఆరెస్ కి రావాల్సిన ఓటు బ్యాంక్ దాదాపుగా మజ్లిస్ పార్టీవైపే వెళుతుంది. ఇదే జరిగితే బీఆరెస్ పార్టీ కి తీవ్ర నష్టం జరుగుతుందని కొందరు రాజకీయ విశ్లేషకుల భావన.

కానీ మరికొందరు రాజకీయ విశ్లేషకులు భావన ఏంటంటే మజ్లీస్ 40 స్థానాల్లో పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకె నష్టం అని వారి అంచనా.

దానికి వారు చెబుతున్న కారణం ఏంటంటే కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు పడింది.

అలాగే దేశవ్యాప్తంగా ముస్లిం ఓటు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నది. ఎందుకంటే బీజేపీపై కచ్చితంగా ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనన్నది కాదనలేని సత్యం.

అలాగే బీఆరెస్ పార్టీ పై రాష్ట్రం లో వ్యతిరేకత ఉంది. అలాగే బీఆరెస్ పార్టీ బీజేపీ తో ఎప్పుడైనా కలవచ్చని ముస్లిం ఓటర్లు సందేహిస్తున్నారు.

2023 లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ముస్లిం ఓటు కాంగ్రెస్ వైపు పడకుండా బీఆరెస్ కు పరోక్షంగా మేలు చేయడానికే ఒవైసి చూస్తున్నట్టు మరికొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

You may also like
cm kcr
కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే!
BRS Cong Flags
రాష్ట్రంలో కాంగ్రెస్.. రాజధానిలో బీఆరెస్.. అనూహ్య ఫలితాలు!
asaduddin owaisi
రేవంత్ జీవితం మొదలైంది అక్కడే.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!
akbaruddin owaisi
పోలీసులకు అక్బరుద్దీన్ వార్నింగ్.. ఒవైసీపై కేసు నమోదు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions