- ఆల్వాల్‌లో రూ. 2.11 లక్షల డిఫెన్స్ మద్యం పట్టివేత!
Alwal Illegal Defense Liquor Seized సైన్యంలో సేవలు అందించి పదవీ విరమణ పొందిన అనంతరం హుందాగా జీవించాల్సిన కొందరు మాజీ సైనికులు అక్రమ మార్గాల్లో అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారు. డిఫెన్స్ క్యాంటిన్లలో లభించే తమ కోటాతో పాటు ఇతరుల కోటా కింద తక్కువ ధరకు వచ్చే మిలిటరీ/డిఫెన్స్ మద్యం బాటిళ్లను అక్రమంగా సేకరించి, ఇంట్లోని భార్యల ద్వారా స్థానికంగా ఎక్కువ ధరలకు అమ్మకాలు సాగిస్తున్న సంచలన దందాను ఎక్సైజ్ శాఖ అధికారులు బట్టబయలు చేశారు. ఆల్వాల్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో రూ. 2.11 లక్షల విలువైన 163 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
లోతుకుంటలో 96 బాటిళ్ల పట్టివేత..
మల్కాజిగిరి ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్‌రావు నేతృత్వంలో సరస్వతీనగర్, లోతుకుంట ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. రామాంజనేయులు అనే మాజీ సైనికుడు డిఫెన్స్ క్యాంటిన్ల నుంచి మద్యం బాటిళ్లను తెచ్చి ఇవ్వగా, ఆయన భార్య మన్యం నాగప్రసన్న ఇంట్లోనే ఉంటూ స్థానికులకు చట్టవిరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ గుర్తించింది. ఇంటిపై దాడి చేసి 96 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరిపై కేసు నమోదు చేసి, నిందితురాలు నాగప్రసన్నను అరెస్టు చేసి ఆల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్‌రావు తెలిపారు.
న్యూ బోయినిపల్లిలో 67 బాటిళ్ల రికవరీ..
ఆల్వాల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని న్యూ బోయినిపల్లి సౌజన్య కాలనీలో ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ (STF) టీమ్-బి సీఐ గణపతిరెడ్డి సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముసిమి లెంక (39) అనే మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 67 డిఫెన్స్ మద్యం బాటిళ్లను టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సదరు మహిళను అరెస్టు చేసి తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఆల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు సీఐ గణపతిరెడ్డి వెల్లడించారు. రెండు వేర్వేరు దాడుల్లో పట్టుబడిన 163 డిఫెన్స్ మద్యం బాటిళ్ల మొత్తం విలువ మార్కెట్‌లో రూ. 2,11,000 (రూ. 2.11 లక్షలు) ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యాన్ని బయట విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.









