Kritika Delhi ASO Budget | మెట్రో సిటీల్లో నివసించే ఉద్యోగులకు జీతాలు ఎంత వచ్చినా నెల తిరిగేసరికి చేతిలో రూపాయి మిగలడం లేదనేది ఈ రోజుల్లో అందరూ చెప్పే మాట.
కానీ, దేశ రాజధాని ఢిల్లీలో నెలకు రూ. 90,000 ఇన్-హ్యాండ్ శాలరీ తీసుకుంటున్న ఒక 28 ఏళ్ల యువతి.. కేవలం రూ. 25,000 బడ్జెట్‌తోనే సింపుల్‌గా జీవిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
2022 ఎస్ఎస్‌సీ సీజీఎల్ (SSC CGL) పరీక్ష రాసి, లెవెల్ 7 కేటగిరీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) గా ఎంపికైన కృతిక అనే యువతి.. తన పొదుపు మంత్రాన్ని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
కృతిక 25 వేల బడ్జెట్ బ్రేక్‌డౌన్ ఇలా ఉంది..
ఢిల్లీ లాంటి ఖరీదైన నగరంలో తన ఖర్చులను ఎలా నియంత్రించుకుంటుందో కృతిక పక్కా లెక్కలతో వివరించింది.
కృతిక ఒక ఫ్లాట్‌మేట్‌తో కలిసి 2BHK ఫ్లాట్‌లో ఉంటోంది. దీనివల్ల రూమ్ రెంట్, ఇతర ఖర్చులు సగానికి సగం తగ్గుతాయి. ఇందులో ఆమె వాటా రెంట్ నెలకు రూ. 11,500.
ఇంటి భోజనం – వంట మనిషి..
బయట తిండికి దూరంగా ఉండే కృతిక.. వంట మనిషి (Maid) కి ఇచ్చే రూ. 5,000 లలో తన షేర్ కింద రూ. 2,500 ఇస్తోంది. ఇక జెప్టో, బ్లింకిట్ వంటి యాప్స్ ద్వారా తెప్పించే సరుకులు కోసం నెలకు రూ. 4,000 నుంచి రూ. 5,000 వరకు ఖర్చు చేస్తోంది.
క్యాబ్‌లు వద్దు.. స్కూటీయే ముద్దు..
ఆఫీస్‌కు లేదా బయటకు వెళ్లడానికి ఖరీదైన క్యాబ్‌లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడకుండా.. సొంత స్కూటీని వాడుతోంది. దీని పెట్రోల్ ఖర్చు నెలకు కేవలం రూ. 1,500 మాత్రమే అవుతుంది.
షాపింగ్ అండ్ నో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్..
నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వంటి OTT ప్లాట్‌ఫామ్‌ల కోసం కృతిక ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. తన సోదరి, స్నేహితుల అకౌంట్ పాస్‌వర్డ్ లనే వాడుకుంటోంది.
ఇక ఆర్డరింగ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ కోసం గరిష్టంగా రూ. 2,000.. నైకా, మింత్రా వంటి యాప్స్‌లో షాపింగ్ కోసం రూ. 3,000 నుంచి రూ. 4,000 మాత్రమే కేటాయిస్తోంది.
ఒకటి లేదా రెండు సార్లు వెళ్లే విహారయాత్రలు (Trips), మేట్రెస్ వంటి వస్తువుల కొనుగోళ్లను ఒకేసారి చేసే ఖర్చులుగా భావిస్తుంది తప్ప.. తన మంత్లీ బడ్జెట్ లో వాటిని చేర్చనని కృతిక స్పష్టం చేసింది.
జీతం భారీగా ఉన్నా, ఆర్భాటాలకు పోకుండా మిడిల్ క్లాస్ పంథాలోనే పొదుపు చేస్తున్న కృతికపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.







