Suryapet SP Extends Sankranti Wishes to Passenger’s with Flowers | సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రజలు పెద్దఎత్తున సొంతూళ్లకు వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రాకు వెళ్లే వారి సంఖ్య అధికం. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65పై వాహనాలు సందడి చేస్తున్నాయి. టోల్ గేట్ల వద్ద కార్లు బారులు తీఋతున్నాయి. ఇదే సమయంలో రంగంలోకి దిగారు సూర్యాపేట ఎస్పీ. వాహనదారులకు పండుగ శుభాకాంక్షలు చెబుతూనే రోడ్డుపై ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరించారు.
సూర్యాపేట పట్టణం వద్ద ఎఫ్సీఐ గోడౌన్ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై వాహనదారులతో ముచ్చటించారు ఎస్పీ నరసింహ. వాహనదారులకు గులాబీ ఇచ్చి క్షేమంగా గ్రామాలకు వెళ్లాలని సూచించారు. వేగం వద్దు అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలకు గులాబీతో స్వాగతం పలికిన ఎస్పీ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రయాణికులు పండుగ సంతోషాన్ని తమ కుటుంబాలతో పంచుకోవాలని, రోడ్డు ప్రమాదాల బారిన పడకూడదని ఎస్పీ నరసింహ సూచనలు చేశారు. గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో అతివేగంగా వెళ్లవద్దన్నారు.









