Man hulchal in Tirupathi | అత్యంత భద్రత కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి (Tirupati)లో జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో (Govindaraja Swamy Temple) ఓ వ్యక్తి మద్యం మత్తులో హంగామా సృష్టించాడు.
కట్టుదిట్టమైన భద్రతను ఛేదించి గోడ దూకి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన అతడు, మహాద్వారం లోపల ఉన్న గోపురాన్ని ఎక్కి పవిత్ర కలశాన్ని తాకేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనతో భక్తులు, ఆలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
ఈ వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మవాడకు చెందిన కుత్తడి తిరుపతిగా గుర్తించారు. ప్రస్తుతం తిరుపతిలో నివసిస్తున్న అతడు భార్యతో కలిసి కూలి పనులు చేస్తున్నాడు. మూడు గంటల పాటు గోపురంపై ఉండిపోయిన అతడు, కిందికి దిగేందుకు “మద్యం క్వార్టర్ బాటిల్ ఇవ్వాలి” అంటూ విచిత్రమైన డిమాండ్ చేశాడు.
పోలీసులు, ఫైర్ సర్వీస్ సిబ్బంది కలిసి చాకచక్యంగా వ్యవహరించి అతడిని సురక్షితంగా కిందికి దించారు. అనంతరం అదుపులోకి తీసుకుని మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఘటన ఆలయ భద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.






