Liquor Sales in Telangana | నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) సందర్భంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది. డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలు (Liquor Sales in Telangana) సరికొత్త రికార్డు సృష్టించాయి.
రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులలో మద్యం అమ్మకాల విలువ రూ.1,350 కోట్లుగా నమోదయ్యింది. ఇందులో చివరి మూడు రోజులు అనగా డిసెంబర్ 29, 30, 31 తేదీల్లోనే రూ.975 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
గతేడాది చివరి మూడు రోజుల్లో రూ. 726 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలు భారీగా మద్యం కొనుగోళ్లు చేయడంతో గతేడాది కంటే విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.
డిసెంబర్ 31 నాడే అత్యధికంగా మద్యం అమ్మకాలు జరినట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా కట్టుదిట్టమైన వ్యవస్థతో మద్యం విక్రయాలపై పర్యవేక్షణ కొనసాగించామని, ఎక్కడైనా అక్రమ రవాణా, చట్ట విరుద్ధ విక్రయాలపై చర్యలు తీసుకున్నామని ఎక్సైజ్ శాఖ తెలిపింది.









