- మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్
- మున్సిపాలిటీల్లోనూ ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారు
- ఆశావహుల జాబితాను రడీ చేయండి టిక్కెట్లు ఇప్పిస్తామని ఎవరు చెప్పినా నమ్మొద్దు
- సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు
- టిక్కెట్లు రానివారికి పార్టీ, నామినేటెడ్ పదవుల్లో సర్దుబాటు చేస్తాం
- ఆవేశంతో రాంగ్ స్టెప్ వేస్తే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది
- ఎన్నికల సమయంలో గొడవలు పెట్టుకునే నేతలను ఉపేక్షించబోం.. వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేస్తాం
- మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివ్రుద్ది అంతా కేంద్ర నిధులతోనే…
- రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డే
- కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం లేని బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే
- కరీంనగర్ కార్పొరేషన్ సహా మున్సిపాలిటీలకు బీజేపీకి అప్పగిస్తే అభివ్రుద్ధి అంటే ఏమిటో చూపిస్తా
- ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లండి
Bandi Sanjay Comments | రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరేయడమే బీజేపీ ముందున్న లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. టిక్కెట్ల విషయంలో పైరవీలు, మొహమాటాలకు తావులేదని, సర్వే రిపోర్టుల ఆధారంగా గెలుపు గుర్రాలకే పార్టీ నాయకత్వం బీజేపీ టిక్కెట్లు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. టిక్కెట్ల కోసం తనతోపాటు తన కుటుంబ సభ్యులకు ఫోన్లు కూడా చేయొద్దని, ఎవరైనా ఒత్తిడి తెస్తే వాళ్లకు వచ్చే టిక్కెట్లు కూడా రావని హెచ్చరించారు.
టిక్కెట్ ఆశించడంలో తప్పు లేదని, గెలవలేని పరిస్థితి ఉన్నప్పుడు అర్ధం చేసుకుని పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. టిక్కెట్లు రాకపోయినా పార్టీ పరంగా, నామినేటెడ్ పోస్టుల పరంగా వారికి న్యాయం చేస్తామన్నారు. ఈసారి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువ మంది నామినేటెడ్ పోస్టులు దక్కేలా క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎన్నికల సందర్భంగా టిక్కెట్ల కోసం, ఇతరత్రా విషయాల్లో గొడవలకు దిగే నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులను కోరారు. టిక్కెట్లు రాలేదనే కోపంతో పార్టీని వదిలివెళ్లాలనుకునే వారి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈసారి తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, రాజకీయ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోవద్దని సూచించారు.
తనకు పార్టీ గెలుపు, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. బ్లాక్ మెయిల్ కు బెదిరింపులకు బండి సంజయ్ లొంగే రకం కాదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు కరీంనగర్ లోని త్రిధా హోటల్ లో కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లోని పట్టణ, జోన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో ‘మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం’ నిర్వహించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, వాసాల రమేశ్, రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి… ఎన్నికల్లో టిక్కెట్లు ఇప్పిస్తానని ఎవరైనా హామీ ఇచ్చినా నమ్మొద్దు.
సర్వే ఆధారంగా గెలిచే అవకాశమున్న వాళ్లకు మాత్రమే టిక్కెట్లు వస్తాయి. పార్టీ నాయకత్వం మాత్రమే టిక్కెట్లు ఇస్తుంది. ఈ విషయంలో ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దు. కరీంనగర్ తోపాటు అన్ని మున్సిపాలిటీల్లో బీజేపీకి మంచి వాతావరణం ఉంది. ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారు. ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం. ఇతర మున్సిపాలిటీల పీఠాలను సైతం బీజేపీ గెలుచుకునేలా చేస్తాం. ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారు.
బీజేపీ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులు మాత్రం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. టిక్కెట్లు రానివారికి పార్టీ, నామినేటెడ్ పదవుల్లో సర్దుబాటు చేస్తాం. ఆవేశంతో రాంగ్ స్టెప్ వేస్తే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఎన్నికల సమయంలో గొడవలు పెట్టుకునే నేతలను ఉపేక్షించబోం. వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేస్తాం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అభివ్రుద్ధి విషయంలో పదేళ్లలో బీఆర్ఎస్, రెండేళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు.
కేంద్ర నిధులతోనే ఆయా మున్సిపాలిటీల్లో అభివ్రుద్ది జరుగుతోంది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం లేని బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే. ఈ నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ సహా మున్సిపాలిటీలన్నింటినీ బీజేపీకి అప్పగిస్తే అభివ్రుద్ధి అంటే ఏమిటో చూపిద్దాం.
ఇదే విషయాన్ని మీరు ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లండి. ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ఓటేసేలా ప్రచారం చేయండి. మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు ఉన్నాయని వార్తలు వస్తున్నాయని, వెంటనే ఓటర్ల ముసాయిదా జాబితాను డివిజన్లు, వార్డుల వారీగా సేకరించి ఇంటింటికీ వెళ్లి పరిశీలించండి. బోగస్ ఓట్లు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయండి.









