CIA lost nuclear device at Nanda Devi in Himalayas | పార్లమెంటు సభ్యులు, బీజేపీ నేత నిశికాంత్ దూబే చేసిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తుంది. హిమాలయ పర్వతాలలో అమెరికా సెంట్రల్ ఇంటలీజెన్స్ ఏజెన్సీ ఓ న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన వినికిడి పరికరాన్ని ఏర్పాటు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరఖండ్ రాష్ట్రంలోని, భారత్ లోనే రెండవ ఎత్తైన నందా దేవి పర్వతంపై ఈ పరికరాలను స్థాపించినట్లు చెప్పారు.
చైనాపై నిఘా ఉంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం కోసం 1964లో తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు, 1967, 1969లో ఇందిరా గాంధీ అమెరికాకు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. ప్లుటోనియంతో కూడిన న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన ఈ పరికరాన్ని అమెరికన్లు హిమాలయ పర్వతాల్లోనే వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు. పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన హిమాలయాల్లో అను ధార్మిక శక్తి ఉన్న పరికరం వదిలేసి వెళ్లిపోయారని ఈ బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేత వ్యాఖ్యల ద్వారా అత్యంత ప్రమాదకరమైన ఈ పరికరం ఏ ప్రదేశంలో ఉంది అనేది ఇప్పటికీ తెలీదని తెలుస్తోంది.
ఇకపోతే ‘ఉత్తరాఖండ్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు గంగా తీరంలో నివసించే ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి పెరగడానికి ఇదే కారణమా? హిమాలయ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ లు, ఇళ్లలో పగుళ్లు, హిమానీనదాలు కరగడానికి ఇదే కారణమా?’ అని ఎంపీ ప్రశ్నించారు. 1978లో పార్లమెంటు వేదికగా నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ అమెరికా ఈ పరికరాన్ని ఏర్పాటు చేసిందని అంగీకరించినట్లు చెప్పారు. ఇప్పుడు ప్రఖ్యాత న్యూయార్క్ టైన్స్ కూడా ఈ వార్తను ప్రచురించిందని వెల్లడించారు. దేశ ప్రజలను కాపాడుకునే సమయం ఆసన్నం అయిందని నిశికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు.









