Hero suffers two gunshot wounds in Bondi beach shooting | ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దశాబ్దాల కాలంలో ఆస్ట్రేలియా గడ్డపై ఇలాంటి రక్తపాతం జరగలేదు. ఇకపోతే ఉగ్రవాదులు ఓ వైపు అమాయక ప్రజలపై కాల్పులు జరుపుతుంటే మరోవైపు ఓ వ్యక్తి చూపిన తెగువ మరెందరో ప్రాణాలను కాపాడింది.
బాండీ బీచ్ లో యూదులే లక్ష్యంగా పాకిస్థాన్ మూలాలు ఉన్న తండ్రీకొడుకులు కాల్పులకు తెగపడ్డ విషయం తెల్సిందే. అయితే అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి ఉగ్రవాదితో పోరాడి అతడి నుండి తుపాకీ లాక్కున్నారు. అనంతరం ఉగ్రవాదిని తరిమికొట్టారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అహ్మద్ ను అభినందించారు.
సిరియాకు చెందిన అహ్మద్ దశాబ్దం క్రితం ఆస్ట్రేలియాకు వచ్చారు. సిడ్నీలో ఓ పండ్ల దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. ఉగ్రదాడి జరిగిన సమయంలో ఓ కాఫీ షాపులో బంధువుతో కలిసి ఉన్నారు అహ్మద్. బాండీ బీచ్ లో యూదులే లక్ష్యంగా ఉగ్రవాదులైన తండ్రీకొడుకులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఓ ఉగ్రవాదిని గమనించిన అహ్మద్ ఏ మాత్రం సంకోచించకుండా ఎదురుతిరిగారు. ఉగ్రవాది వెనక నుండి వెళ్లి అతన్ని గట్టిగా పట్టుకుని తుపాకీ లాక్కున్నారు అహ్మద్. అనంతరం అదే తుపాకీ ఎక్కుపెట్టి ఉగ్రవాది పారిపోయేలా చేశారు. పోలీసుల కాల్పుల్లో ఉగ్రవాది హతం అయ్యారు. అయితే ఈ ఘర్షణ సమయంలో మరో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అహ్మద్ చూపిన తెగువ ఎందరో ప్రాణాలను కాపాడింది. అహ్మద్ ను డోనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. త్వరగా కోలుకోవలన్నారు. అహ్మద్ చూపిన తెగువకు గర్వపడుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.









