KTR News Latest | కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు రిక్త హస్తం అని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిందని పేర్కొన్నారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం కాయమన్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత ఎన్నికలు ఆదివారం ముగిసిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో కేటీఆర్ స్పందిస్తూ..రెండో దశ ఎన్నికల్లోనూ బీఆరెస్ అద్వితీయ ఫలితాలు సాధించిందన్నారు. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చిచెప్పారన్నారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని తెలిపారు. నాడు బీఆర్ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే, నేడు కాంగ్రెస్ సగం పంచాయతీలను కూడా గెలవకపోవడం, పల్లె పల్లెనా అధికారపార్టీపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతమని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.









