Rahul Gandhi Coming For CM Revanth vs Messi Match | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సి మధ్య శనివారం సాయంత్రం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ జరగనున్న విషయం తెల్సిందే. ఈ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్నారు లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.
‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ లో భాగంగా మెస్సి శనివారం తెల్లవారుజామున కోల్కత్త చేరుకున్నారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మెస్సి సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. అనంతరం సాయంత్రం ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియంలో సింగరేణి ఆర్ఆర్9, అపర్ణ మెస్సి ఆల్ స్టార్స్ మధ్య మ్యాచ్ జరగనున్నది. ఈ మ్యాచ్ సుమారు 20 నిమిషాల పాటు సాగనుంది.
చివరి ఐదు నిమిషాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్సితో తలపడనున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ ను వీక్షించేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు రాహుల్ హైదరాబాద్ కు వస్తారు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కు వెళ్తారు. ఇకపోతే మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. టికెట్లు ఉన్నవారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని పోలీసులు స్పష్టం చేశారు









