TTD News Latest | గత పాలక మండలి శాలువాల కొనుగోళ్ల అవకతవకలు బయటపడ్డాయని సంచలన ఆరోపణలు చేశారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీకి రూ.350 విలువైన పట్టు శాలువాను రూ.1350కు సరఫరా చేసిన భారీ స్కామ్‌పై ప్రస్తుత పాలక మండలి సమగ్ర విచారణ ప్రారంభించిందని పేర్కొన్నారు. యేటా రూ.20 కోట్ల విలువైన శాలువాల కొనుగోళ్లను పరిశీలించినప్పుడు, 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.80–90 కోట్ల అవినీతి జరిగి ఉండొచ్చని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.
శుద్ధమైన తుస్సా పట్టుతో, బంగారం/వెండి జరీతో, సిల్క్ మార్క్ ధృవీకరణతో తయారవ్వాల్సిన శాలువాలను నాసిరకం పట్టుతో సరఫరా చేసిన విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. దీనిపై బోర్డు చర్చించి ACB విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. నివేదిక వచ్చిన వెంటనే కఠిన చర్యలు ఉంటాయని బాధ్యులైన అధికారులపై ఇప్పటికే ప్రక్రియ మొదలైందని వెల్లడించారు.
గత ప్రభుత్వ కాలంలో కల్తీ నెయ్యి, నాసిరకం సరుకులు, పరకామణి చోరీ, టెండర్ల మార్పిడి వంటి అనేక అవినీతి కేసులు బయటపడ్డాయని ఇవన్నీ దశల వారీగా బయటపెట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నట్లు బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. టీటీడీలో పారదర్శకత అనేది అత్యంత ప్రాధాన్యత అని అవినీతి ఎవరు చేసినా వదిలేదే లేదన్నారు.









