Harbhajan Singh ditches no-handshake policy with Pakistan | టీం ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పాకిస్థానీ ప్లేయర్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తో ఎలాంటి ద్వైపాక్షిక సంబంధాలు ఉండవని భారత్ స్పష్టం చేసింది. అలాగే ఆసియా కప్-2025, మహిళల వరల్డ్ కప్ లో టీం ఇండియా పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించింది. అయితే ఇదే సమయంలో హర్భజన్ పాక్ ఆటగాడికి కరచాలనం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన అబుదాబి టీ-10 లీగ్ సందర్భంగా చోటుచేసుకుంది. ఈ లీగ్ లో భాగంగా ఆస్పిన్ స్టాలియన్స్ కు హర్భజన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.
నార్తర్న్ వారియర్స్ తో జరిగిన మ్యాచులో హర్భజన్ సేన నాలుగు పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్ లో భాగంగా నార్తర్న్ వారియర్స్ తరఫున ఆడుతున్న పాకిస్థాన్ బౌలర్ షానవాజ్ దహాని రెండు ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. రెండవ ఇన్నింగ్స్ చివరి బాల్ లు హర్భజన్ రన్ ఔట్ అయ్యారు. మ్యాచ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ ప్లేయర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లో భాగంగా పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడేందుకు భారత్ నిరాకరించిన విషయం తెల్సిందే. అప్పుడు భారత జట్టులో హర్భజన్ కూడా భాగమే. సెమీ ఫైనల్స్ లో కూడా పాక్ తో మ్యాచ్ ఆడేదే లేదని బహిష్కరించడంతో పాక్ ఏకంగా ఫైనల్స్ కు వెళ్ళింది. కానీ ఇప్పుడు హర్భజన్ పాక్ ప్లేయర్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడం గమనార్హం.









