Bandi Sanjay News Latest | అర్బన్ నక్సలైట్స్ మాయలో పడి అజ్ఞాతంలో అడవుల్లో ఉన్న మావోయిస్టులు మోసపోవద్దని కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మంగళవారం ఉదయం మోస్ట్ వాంటెడ్, మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక నేత మద్వి హిడ్మా భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో ఉండే సైన్యం వద్ద, సమాజాన్ని రక్షించే పోలీసుల వద్ద మినహా ఇతరులు ఆయుధాలు కలిగి ఉండటాన్ని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సహించదని, క్షమించదని స్పష్టం చేశారు. సమాజాన్ని, దేశాన్ని రక్షించాలనే లక్ష్యంతో హోంమంత్రి అమిత్ షా నక్సలిజాన్ని అంతం చేయాలనే సంకల్పంతో మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చారని కానీ కొందరు మొండి పట్టుదలతో తమ ప్రాణాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఛత్తీస్ ఘడ్ లో గిరిజన మైనర్ బాలికలకు తుపాకులు ఇస్తున్నారని మావోయిస్టులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభంశుభం తెలినీ బాలికలకు తుపాకులు ఇచ్చి ఏం సాధిస్తారు అంటూ బండి ప్రశ్నించారు. జనజీవన స్రవంతిలోకి వచ్చి సమాజ మార్పు కోసం కృషి చేయాలని కోరారు. కానీ తుపాకులు పట్టి పోరాటం చేస్తామంటే నరేంద్రమోదీ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించదన్నారు. అర్బన్ నక్సలైట్స్ మాయలో పడి అడవుల్లో మావోయిస్టులు మోసపోవద్దన్నారు. నగరాల్లో ఏసీ రూముల్లో ఉండే అర్బన్ నక్సలైట్లు ప్రభుత్వం ఏదైనా వారితో లాలూచీ పడుతారని అలాంటి వారిని నమోద్దని మావోయిస్టులను బండి సంజయ్ కోరారు.









