MOU Signed Between COL and Ambedkar University in Presence of CM Revanth Reddy | తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యా వ్యవస్థను మరింత మెరుగ్గ మార్చాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి సమక్షంలో మంగళవారం ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ iDEA ఏర్పాటుకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. COL అధ్యక్షుడు, సీఈఓ ప్రొఫెసర్ పీటర్ స్కాట్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
ఈ ఒప్పందంతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందనుందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి iDEA అత్యాధునిక డిజిటల్ హబ్‌గా పనిచేస్తుందన్నారు. టెక్నాలజీ ద్వారా నాణ్యమైన విద్య అందించేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.









