31 Maoists posing as labourers arrested in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరం మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానిక పోలీసులతో కలిసి ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు కలిసి భారీ ఆపరేషన్ నిర్వహించాయి. విజయవాడ శివారు కానూరు న్యూ ఆటో నగర్ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో ఏకంగా 27 మంది మావోయిస్టులను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అలాగే మావోయిస్టులు నాలుగు చోట్ల డంపులను సైతం ఏర్పాటు చేయగా బలగాలు వాటిలో దాచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
పట్టుబడిన మావోయిస్టులు ఛత్తీస్ ఘడ్ కు చెందినవారు అని తెలుస్తోంది. సుమారు పది రోజుల క్రితం నగరంలోకి వచ్చిన వీరు తమను తాము కూలీలుగా చెప్పుకుని ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నట్లు, అనంతరం ఇందులోనే మారువేషంలో ఉంటున్నట్లు బలగాలు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా గుర్తించాయి. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే మావోయిస్టులు అడవులను వీడి నగరంలోకి వచ్చినట్లు తెలుస్తోంది.
దింతో భారీ ఆపరేషన్ ను చేపట్టిన బలగాలు న్యూ ఆటో నగర్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అనంతరం భవనంలో ఉంటున్న 27మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. మావోయిస్టుల డంపుల నుండి రెండు ఏకే-47, 1525 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 150 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లతో పాటు ఆయుధాలు మరికొన్ని పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు ఇంటలీజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.
కాకినాడ, విజయవాడ ప్రాంతాల్లో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో 9మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు వివరించారు. ఇకపోతే మంగళవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే.









