Monday 12th January 2026
12:07:03 PM
Home > తాజా > పత్తి రైతుల సమస్యలపై తీరేదాకా బీఆర్‌ఎస్‌ పోరాటం: కేటీఆర్

పత్తి రైతుల సమస్యలపై తీరేదాకా బీఆర్‌ఎస్‌ పోరాటం: కేటీఆర్

brs-fight-until-resolution-on-cotton-farmers-says-ktr
  • పత్తి రైతుల సమస్యలు తీర్చాలని కేటీఆర్ డిమాండ్
  • పత్తి కొనుగోలు మరింత వేగవంతం చేయాలని సిసిఐ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన కేటీఆర్ మరియు సీనియర్ నాయకులు
  • రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పండే పత్తి పంట సమస్యలు, తేమ శాతం బాధలు, పంట నష్టాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చ లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి

KTR Protest | భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరియు పార్టీ సీనియర్ నాయకులు ఆదిలాబాదులోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) అధికారులను కలిసి పత్తి రైతుల సమస్యలపై సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కాపస్ (Kapas) యాప్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీంతోపాటు ఎకరానికి ఏడు క్వింటార్ల పత్తిని మాత్రమే కొంటామంటూ పెట్టిన నిబంధనను వెంటనే తొలగించాలని, తేమ శాతం 20 వరకు ఉన్న పట్టి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కిసాన్ కపుల్స్ ఆప్ ను తీసుకువచ్చిన సిసిఐ, సరైన శిక్షణ, అవగాహన లేకుండా, ఆకస్మికంగా ప్రవేశపెట్టడం వలన కొనుగోళ్లలో అనవసరమైన జాప్యం జరుగుతోందని ఆయన తెలిపారు.

ఆదిలాబాద్‌లో రైతన్నలందరికీ స్మార్ట్‌ఫోన్లు ఉండాలనే నిబంధన లేదని, కనెక్టివిటీ సరిగా లేదని, శిక్షణ లేని కారణంగా ఈ యాప్ వల్ల రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ సమయానికి 5 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసే సీసీఐ, ఈసారి లక్ష క్వింటాళ్లు కూడా కొనుగోలు చేయలేదని రైతులు చెబుతున్నారని, కాబట్టి పాత పద్ధతిలోనే మార్కెట్ యార్డుకు వచ్చి నేరుగా అమ్ముకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ యాప్‌ను కొనసాగించాలనుకుంటే, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేయడానికి ముందుగానే రెండు-మూడు నెలల పాటు రైతులకు శిక్షణ, ఓరియంటేషన్ ఇవ్వాలని సూచించారు.

రెండవ ప్రధాన సమస్యగా తేమ శాతం (Moisture Content) నిబంధనను కేటీఆర్ ప్రస్తావించారు. ఈ ఏడాది ఆదిలాబాద్‌లో భారీ వర్షపాతం, నవంబర్ 18 నాటికి 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో, నల్లరేగడి నేలల్లో పండించే పత్తిలో తేమ శాతం సహజంగానే ఎక్కువగా ఉంటుందని వివరించారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 20-22% తేమ ఉన్నప్పటికీ సీసీఐతో కొనుగోలు చేయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి పత్తిని దిగుమతి చేసుకోవాలని ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల దేశీయ పత్తి రైతులు ఆగమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

8% నుండి 12% మధ్య తేమ ఉంటేనే కొంటామని, తేమ పెరిగే కొద్దీ ధర తగ్గిస్తామని సీసీఐ అధికారులు నిబంధన పెట్టడం వల్ల క్వింటాలుకు 8,110 రావాల్సిన రైతుకు కేవలం 5,000 నుండి 6,200 మాత్రమే వస్తోందని, తద్వారా సుమారు 3 వేల వరకు నష్టపోతున్నారని తెలిపారు.

అంతేకాక, కొనుగోలు పరిమితి నిబంధనను కేటీఆర్ తప్పుబట్టారు. ప్రస్తుతం కేవలం 7 క్వింటాళ్లే కొంటామని నిబంధన పెట్టడం సరికాదని, దీనిని కచ్చితంగా 13 క్వింటాళ్ల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. జైనత్, బేలా వంటి కొన్ని ప్రాంతాల్లో ఎకరానికి 15-18 క్వింటాళ్ల వరకు పండుతున్నప్పుడు, 7 క్వింటాళ్లే కొంటే మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు వాపోతున్నారని తెలిపారు.

ఆదిలాబాద్‌లో పత్తి, సోయా రైతుల పరిస్థితి “అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి” అన్నట్టుగా ఉందని, సీసీఐ సతాయిస్తుంటే, మరోవైపు ప్రైవేట్ వ్యాపారులు కూడా మిల్లులు మూసివేసి నిరవధిక సమ్మెకు పోయారని, దీంతో రైతులు ఎవరికీ అమ్ముకోలేని దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పత్తిని నిల్వ చేసుకున్న ఇద్దరు రైతులు అగ్ని ప్రమాదాల వల్ల నష్టపోయిన ఘటనలను ఆయన ప్రస్తావించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని హామీలపైనా కేటీఆర్ మండిపడ్డారు. పీఎం ఫసల్ బీమా యోజన, ఇన్‌పుట్ సబ్సిడీ, అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 నష్ట పరిహారం వంటి హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు.

అధిక వర్షపాతం, పంట నష్టంపై రాష్ట్రంలో కనీసం ఎన్యూమరేషన్ (నష్టం అంచనా) కూడా చేయలేదని, రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పండే పత్తి పంట సమస్యలు, తేమ శాతం బాధలు, పంట నష్టాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చ లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

క్యాబినెట్ సమావేశాలు కేవలం రాజకీయ అంశాలకే పరిమితమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, రైతుబంధు, రుణమాఫీ వంటివి సక్రమంగా అమలు చేయకుండా, కనీసం యూరియా, విద్యుత్తు కూడా సరిగా ఇవ్వకుండా, పండించిన పంటకు మద్దతు ధర, సరైన కొనుగోలు కూడా చేయకుండా రైతులను ఇంకా ఎంత రాచిరంపాన పెడతారని ప్రశ్నించారు.

రైతుల ఆత్మహత్యల గురించి ప్రస్తావిస్తూ, గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో 700 పైచిలుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో విశ్వాసం నింపడానికి, పోరాడదామని భరోసా ఇవ్వడానికే బీఆర్‌ఎస్ బృందం ఇక్కడికి వచ్చిందని కేటీఆర్ తెలిపారు.

ఈ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, సోయా కొనుగోలు పరిమితిని 7 క్వింటాళ్ల నుండి 10 క్వింటాళ్లకు పెంచడాన్ని ఆయన స్వాగతించారు. అయితే, పత్తి కొనుగోలు పరిమితిని కూడా 7 క్వింటాళ్ల నుండి 13 క్వింటాళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.

అలాగే, రైతులను ఇబ్బంది పెడుతున్న ఫింగర్ ప్రింటింగ్ (బయోమెట్రిక్) నిబంధనను కూడా తీసివేయాలన్నారు. పెద్ద వయసు వారికి, కూలి పని చేసే వారికి ఫింగర్ ప్రింట్స్ సరిగా పనిచేయవని, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు చూసి, కుటుంబ సభ్యులలో ఎవరొచ్చినా ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.

నవంబర్ 21వ తేదీన ఆదిలాబాద్ అన్నదాతలు అఖిలపక్షంగా ఏర్పడి తలపెట్టిన జాతీయ రహదారుల దిగ్బంధనం (బోరస్, ఐచ్చోడ పాయింట్లలో) కార్యక్రమానికి బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, పార్టీ శ్రేణులు పాల్గొంటాయని కేటీఆర్ ప్రకటించారు. సీసీఐ అధికారులను కలిసి సమస్య వివరించగా, వారు తమ పరిధిలో లేదని, మినిస్ట్రీకి చెప్తామని అన్నారని తెలిపారు.

దీనిపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్పందించాలని, ఇక్కడి ఎంపీ, ఎమ్మెల్యే కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. రైతుల విషయంలో రాజకీయాలు అవసరం లేదని, అఖిలపక్షంగా కలిసి కేంద్రం వద్దకు వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

గతంలో ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెరిపిస్తామని ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవాలని, ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా సరిగా పనిచేయనివ్వడం లేదని విమర్శించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి కేంద్ర మంత్రులు స్పందించాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 21వ తేదీన జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ రైతన్నలకు, బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions