Mohammad Azharuddin to join Telangana cabinet | తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుంది. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్ లో 15 మంది మంత్రులు ఉండగా, మరో ముగ్గురికి చోటు ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
పార్లమెంటు మాజీ సభ్యులు, టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఖాయం అయ్యింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి క్యాబినెట్ లో ముస్లిం మైనారిటీ వర్గం నుంచి ఎవరో ఒకరు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ముస్లిం మైనార్టీ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవలేదు. ఈ క్రమంలోనే ఏదో ఒక విధంగా ముస్లిం మైనారిటీ కోటలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం భావించింది.
ఈ నేపథ్యంలో అజారుద్దీన్ పేరు ఖాయం అయ్యింది. ఆయన శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముగ్గురికి క్యాబినెట్ లో అవకాశం ఉన్నప్పటికీ ఒక్కరికే అవకాశం దక్కనుంది. మరో ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అజారుద్దీన్ ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంలను కాంగ్రెస్ ఎంపిక చేసింది. అయితే ఇంకా ఆమోదం లభించలేదు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామకం అవ్వకపోయినా త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం దక్కుతుంది. కాగా మంత్రిగా ప్రమాణం చేసిన ఆరు నెలల్లోగా అజారుద్దీన్ ను ఎమ్మెల్సీ చేసే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉంది. ఇకపోతే 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ ఓటమిపాలయ్యారు.









