Cyclone Montha: How it got its name | మొంథా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాల్లో హై అలెర్ట్ నెలకొంది. కోస్తా జిల్లాలతో పాటుగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుఫాన్ కారణంగా ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో మొంథా అంటే అర్థం ఏంటి, అసలు తుఫాన్లకు పేర్లు ఎలా పెడుతారు అనేది ఆసక్తిగా మారింది.
మొంథా అనే పేరును థాయిలాండ్ దేశం సూచించింది. దీని అర్ధం పరిమళభరితమైన, లేదా అందమైన పువ్వు. బంగాళాఖాతంలో వాయుగుండంగా మొదలైన మొంథా ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారింది. బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంతంలో ఏర్పడే తుఫాన్ల పేర్లను 13 దేశాలు సూచించిన జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేసే ప్రపంచ జలవాతావరణ సంస్థ దీని బాధ్యత తీసుకుంటుంది. ఇందులో భాగంగా 13 దేశాలతో కూడిన ఒక ప్యానెల్ ఉంది. భారత్ చుట్టూ ఉండే దేశాలు ఇందులో ఉంటాయి. ఒక్కో దేశం 13 పేర్లను సూచిస్తాయి.
పేర్లు కూడా ఒక వర్గాన్ని, సమూహాన్ని అవమానించే విధంగా ఉండకూడదు. అలాగే ఉచ్ఛరణకు సులభంగా, ఎనమిది అక్షరాలు మించకూడదు. ఈ క్రమంలో వర్ణమాల ఆధారంగా వివిధ తుఫాన్లకు పేర్లను పెడుతారు. ఈ నేపథ్యంలో తాజగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, తుఫాన్ గా మారిన అనంతరం భారత వాతావరణ శాఖ 13 దేశాలతో కూడిన ప్యానెల్ ప్రతిపాదించిన లిస్టు ఆధారంగా మొంథా అని నామకరణం చేసింది. 2004లో ఇలా పేర్లు పెట్టె ప్రక్రియ మొదలైంది.
2020లో మరోసారి అన్ని దేశాలు కొత్త పేర్లను సూచించినట్లు తెలుస్తోంది. తుఫాన్లకు పేర్లు పెట్టడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం, వివిధ మార్గదర్శకాలు జారీ చేయడం సులభం అవుతుంది.









