Taliban Foreign Minister’s Delhi Press Meet Excludes Women Journalists | అఫ్గానిస్థాన్ లో తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారతదేశంలో పర్యటించారు. ఇందులో భాగంగా శుక్రవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు అఫ్గాన్-భారత్ మధ్య మరింత మైత్రిని పెంచనున్నాయి. ఈ భేటీ అనంతరం తాలిబన్ మంత్రి ముత్తాఖీ ఢిల్లీలోని అఫ్గాన్ రాయబార కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించారు.
ఇది ఇప్పుడు వివాదంగా మారింది. కారణం ఈ సమావేశానికి ఒక్క మహిళా జర్నలిస్టును కూడా అనుమతించలేదు. అఫ్గాన్ లోని తాలిబన్ పాలనలో మహిళల హక్కులపై తీవ్రమైన అణిచివేత ఉంటుందనేది తెలిసిన విషయమే. కాగా ముత్తాఖీ మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడం పట్ల ప్రతిపక్షాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి.
తాలిబన్ మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులకు అనుమతి ఇవ్వకపోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. మరోవైపు ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు.









