Arattai The Indian Messaging App | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ సోషల్ మీడియా యాపుల బదులు స్వదేశీ వాటిని ఎందుకు వాడకూడదన్నారు. అలాగే దేశ వృద్ధిలో భాగంగా ప్రజలు స్వదేశీ ఉత్పత్తులు, సేవలనే వినియోగించాలని పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు స్వదేశీ సోషల్ మీడియా యాపులను ప్రోత్సహిస్తున్నారు. వాట్సప్ కు పోటీగా ఏర్పడిన అరట్టై ఇప్పుడు నేటిజన్లను ఆకర్షిస్తోంది. అరట్టై అనే యాపును తమిళనాడు కు చెందిన జోహో అనే సంస్థ 2021లోనే రూపొందించింది. అయితే తాజాగా ఇది వైరల్ గా మారింది. కేవలం వారం రోజుల్లోనే 7 మిలియన్ల డౌన్లోడ్లను సొంతం చేసుకుని వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు ఎలక్ట్రానిక్ మెయిల్ జీ-మెయిల్ కు పోటీగా జోహో మెయిల్ కూడా అందుబాటులోకి వచ్చింది.
బుధవారం జోహో మెయిల్ లో ఖాతాను తెరిచినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. తనను ఇకనుండి ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే జోహో మెయిల్ ద్వార సందేశం పంపాలని కోరారు. amitshah.bjp@zohomail.in తన మెయిల్ అడ్రస్ అని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం స్వదేశీ యాపులను ప్రోత్సహిస్తున్న తరుణంలో అరట్టై మరియు జోహో మెయిల్ లాంటివి అమెరికన్ మరియు విదేశీ యాపులకు ఘట్టి పోటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.









