Lawyer attempts to attack CJI BR Gavai with a shoe in courtroom | భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్‌పై సోమవారం సుప్రీం కోర్టులో ఒక న్యాయవాది దాడి చేయడానికి ప్రయత్నించాడు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ న్యాయవాదుల కేసుల వాదనలను వింటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ న్యాయవాది డయాస్ దగ్గరకు వెళ్లి, తన షూ తీసి న్యాయమూర్తిపై విసరడానికి ప్రయత్నించాడు. అయితే కోర్టులో ఉన్న భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి అతన్ని బయటకు తీసుకెళ్లారు. బయటకు వెళ్తూ, ఆ న్యాయవాది “సనాతన ధర్మాన్ని అవమానించడం మేము సహించము” అని బిగ్గరగా అరిచాడు. సీజేఐ గవాయ్ స్పందిస్తూ కోర్టులో ఉన్న న్యాయవాదులను తమ వాదనలను కొనసాగించమని కోరారు.
ఈ విషయాలతో తన దృష్టి మళ్లించలేరని ఈ ఘటనతో తాను ఎలాంటి ఆందోళన చెందలేదన్నారు. అలాగే ఇలాంటి ఘటనలు తనపై ప్రభావం చూపవన్నారు. కాగా కొన్ని రోజుల క్రితం ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మధ్యప్రదేశ్ ఖజురాహోలోని 7 అడుగుల తల లేని విష్ణుమూర్తి విగ్రహం పునరుద్ధరించాలని కోరుతూ ఓ వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో పిటిషన్ ను కొట్టివేసిన సీజేఐ ‘వెళ్లి ఆ దేవుడిని స్వయంగా ఏదైనా చేయమని అడగండి. మీరు విష్ణుమూర్తి భక్తుడని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు వెళ్లి ప్రార్థన చేయండి. ఇది ఒక పురావస్తు స్థలం, దీనికి ASI అనుమతి అవసరం’ అని వ్యాఖ్యానించారు.









