Harish Rao News Latest | హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆస్పత్రి భవనాలను ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు.
ఈ మేరకు శనివారం బీఆరెస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, కేపీ వివేకానంద్ లతో కలిసి ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రిని హరీష్ పరిశీలించారు. రెండేళ్లుగా టిమ్స్ ఆస్పత్రులను పడావు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని ధ్వజమెత్తారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ లను పూర్తి చేసి వినియోగంలోకి తేవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని మండిపడ్డారు.
కేసీఆర్ మీద కక్షతో ఆసుపత్రులపై పగ పెంచుకోవడం దారుణమన్నారు. రూ. 1400 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి, పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రుల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.









