Mohanlal To Get Dadasaheb Phalke Award For His Contribution To Cinema | మలయాళ అగ్ర కథానాయకుడు, 40 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న మోహన్ లాల్ కు అరుదైన గౌరవం దక్కింది.
సినీ రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. 2023 సంవత్సారానికి గాను మోహన్ లాల్ ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నటనతో పాటు నిర్మాతగా, దర్శకుడిగా సినీ రంగానికి చేసిన విశేష కృషిని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 23న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరగబోయే 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రాధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి మోహన్ లాల్ కు ఈ అవార్డును అందించనున్నారు. ఫాల్కే అవార్డును అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు మోహన్ లాల్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ పురస్కారం తనతో పాటు నడిచిన అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిశ్రమకు చెందిన సన్నిహితులకు కూడా చెందుతుందని ప్రకటించారు. కాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు మోహన్ లాల్ ఎంపికైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ సీఎం పినరయి విజయన్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 350కి పైగా సినిమాల్లో మోహన్ లాల్ నటించారు. అలాగే 2001లో పద్మశ్రీ, 2019లో పద్మ భూషణ్ అవార్డులను సైతం కైవసం చేసుకున్నారు.









