Prime Minister Narendra Modi held a meeting with Cai Qi | ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటన సందర్భంగా జరిగిన ఓ భేటీ అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ప్రధాని భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రధాని చైనా కమ్యూనిస్టు పార్టీ సెక్రటేరియట్ సెక్రటరీ, పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాయ్ క్వీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు.
కాయ్ క్వీ, జిన్పింగ్ కు కుడిభుజం అనే పేరుంది. కాయ్ క్వీ జిన్పింగ్ కు అత్యంత సన్నిహిత వ్యక్తి మరియు చైనా కమ్యూనిస్టు పార్టీలో ఆయన పలు కీలక పదవుల్లో ఉన్నారు. సాధారణంగా కాయ్ క్వీ దౌత్య భేటీలకు దూరంగా ఉంటారు. కానీ మోదీతో చర్చలు జరిపేందుకు జిన్పింగ్ ఏకంగా కాయ్ క్వీనే రంగంలోకి దింపడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మోదీ-జిన్పింగ్ భేటీకి అనుబంధంగా ఈ భేటీ జరిగింది. భారత్-చైనా మధ్య సంబంధాలపై ప్రధాని కాయ్ క్వీతో తన ఆలోచన పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్యం పై చర్చించినట్లు కథనాలు వస్తున్నాయి. అలాగే ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై కూడా చర్చించినట్లు సమాచారం. దీనిలో భాగంగా ప్రత్యక్ష విమాన సేవల పునః ప్రారంభం, వీసా సౌకర్యాలు మరియు కైలాస మానససరోవర యాత్ర వంటివి ప్రోత్సహించడంపై కూడా చర్చించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.









