Mallikarjun Kharge News | ప్రధాని నరేంద్ర మోదీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడికి సంబంధించి మూడు రోజుల ముందే నిఘా వర్గాలకు సమాచారం ఉందని, అయినప్పటికీ ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ఉగ్రదాడి గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు మూడు రోజుల ముందే హెచ్చరించాయని, ఈ నేపథ్యంలో ప్రధాని జమ్మూకశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. తన పర్యటనను రద్దు చేసుకున్న మోదీ, పర్యాటకులకు మాత్రం ఎందుకు భద్రత కల్పించలేదన్నారు.
సమాచారం ఉన్నా జమ్మూలో భద్రతను ఎందుకు కట్టుదిట్టం చేయలేదని నిలదీశారు. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వమే అంగీకరించిందని ఖర్గే తెలిపారు. ఇదే సమయంలో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
దేశమే ముఖ్యమని, రాజకీయ విభేదాలు కంటే జాతి ఐక్యమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాంచీ వేదికగా జరిగిన ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.









