Vizag Steel Plant Privatization News | విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటికరణ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని మాజీ ఉద్యోగి పాడి త్రినాథరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు ఒక లేఖ బయటకు రావడం సంచలనంగా మారింది.
ఈ లెటర్ ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని నిలదీసింది వైసీపీ. అలాగే విశాఖ ఉక్కుపై కేంద్రానిది రెండు నాలుకల ధోరణి అని దుయ్యబట్టారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ( Ys Sharmila ). ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
విశాఖ ఉక్కును కేంద్రం అమ్మేస్తుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది ప్రభుత్వ ఫాక్ట్ చెక్ ( Fact Check )విభాగం. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని, ఇప్పటికే కేంద్రమంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారని పేర్కొంది.
విశాఖ ఉక్కు పునరుజ్జీనానికి కేంద్రం రూ.వేలకోట్ల ప్యాకేజీ ప్రకటించిందని, ఎన్డీఏ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా విశాఖ ఉక్కు పరిరక్షణకు కృషి చేస్తోందని తెలిపింది. ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు విష ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించింది.