Telangana Caste Census | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణన, సామాజిక సర్వే విజయవంతంగా పూర్తయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా కులగణన అంశంపై నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అందజేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహించారు. బలహీన వర్గాలు అభ్యున్నతి కోసమే ఈ సర్వే చేసినట్లు పేర్కొన్నారు.
సర్వేలో భాగంగా మొత్తం 3,54,77,554 మంది వివరాలను నమోదు చేసినట్లు చెప్పారు. 96.90 శాతం ప్రజలు సర్వేలో పాల్గొన్నారని, 3.10 శాతం వివిధ కారణాల వల్ల సర్వేలో పాల్గొనలేదన్నారు. 1,12,15,131 కుటుంబాల వివరాలను నమోదు చేశామన్నారు.
కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సి జనాభా 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, బీసీలు 46.25 శాతం, ముస్లిం మైనారిటీ బీసీలు 10.08 శాతం, ముస్లిం మైనారిటీ ఓసీలు 2.48 శాతం, ఓసీల జనాభా 15.79 శాతంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ నివేదిక ప్రకారం ముస్లిం మైనారిటీ బీసీలను కూడా కలుపుకుంటే రాష్ట్రంలో 56.33 శాతం బీసీల జనాభా ఉంది.









