3000 world leaders for Telangana Rising summit | ”తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి” అన్న నినాదంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచంలో పేరొందిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న ఈ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నట్టు ఇప్పటికే సమాచారం పంపించారని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. తర్వాత ఈ నెల 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, లియోనల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలువనుందని ప్రభుత్వం ఈ మేరకు తెలిపింది









