Chicken Shops Bund | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ విక్రయాలు నిలిచిపోనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ (మార్జిన్) పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది రిటైల్ దుకాణాలు మూతపడనున్నాయి. చికెన్ షాపుల యజమానులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మార్జిన్ల తగ్గింపు. గతంలో కిలో చికెన్‌పై పౌల్ట్రీ కంపెనీలు రూ. 26 మార్జిన్ ఇచ్చేవి. గత 20 ఏళ్లుగా ఇదే కొనసాగుతోంది.
ప్రస్తుతం ఇటీవల ఈ మార్జిన్‌ను ఏకంగా రూ. 16కు తగ్గించారని చికెన్ షాపుల నిర్వాహకులు వాపోతున్నారు. పెరిగిన నిర్వహణ వ్యయం, ధరలను దృష్టిలో ఉంచుకుని కిలోకు రూ. 30 మార్జిన్ ఇవ్వాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.
“తక్కువ మార్జిన్ల వల్ల షాపుల అద్దెలు, కరెంటు బిల్లులు, పనివారి జీతాలు చెల్లించడం కష్టంగా మారింది. మా జీవనోపాధి దెబ్బతింటోంది. పౌల్ట్రీ కంపెనీలు మా డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదు” అని అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు.
ఒకవైపు ఎండలు పెరుగుతుండటంతో చికెన్ వినియోగం అధికంగా ఉండే ఈ సమయంలో, బంద్ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు మరియు సామాన్య ప్రజలపై పడనుంది.
నిల్వ ఉన్న చికెన్ అయిపోతే మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరసన కొనసాగుతుందని, ప్రభుత్వం లేదా పౌల్ట్రీ యాజమాన్యాలు చర్చలకు రావాలని వారు కోరుతున్నారు.






