- త్వరలో రాష్ట్రంలో కుల గణన
- నియోజకవర్గానికో ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్
- గురుకులాలకు సొంత భవనాలకు స్థలాల గుర్తింపు
- గ్రీన్ ఛానల్ ద్వారా డైట్, కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపు
- విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మరింత ప్రయోజనం
- బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని ప్రకటన చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించారు.
వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు.
ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని అన్నారు.
మహాత్మ జ్యోతిభాపూలే ఓవర్ సీస్ స్కాలర్ షిప్ స్కీమ్ ను మరింత సమర్థంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పుడున్న దాని కంటే ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలని అన్నారు.
విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని అన్నారు. వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్ లో మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటేడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు.
దీంతో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత మెరుగ్గా చేసే వీలుంటుందని అన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవటం ద్వారా వారిలో ప్రతిభా పాఠవాలు పెరుగుతాయని, పోటీ తత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
వెంటనే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని ఆదేశించారు.
నియోజకవర్గ కేంద్రంలో వీలు కాకుంటే ప్రత్యామ్నాయంగా అదే సెగ్మెంట్లో మరో పట్టణం లేదా మండల కేంద్రాలను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే 20 ఎకరాలకుపైగా విస్తీర్ణమున్న స్కూల్ ప్రాంగణాల్లో మిగతా భవనాలు నిర్మించి హబ్ గా తీర్చిదిద్దే అవకాశాలుంటే పరిశీలించాలని అన్నారు.
ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల, కంపెనీల సహకారం తీసుకోవాలని సీఎం అన్నారు. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్స్ ను సమీకరించాలని, ముందుకు వచ్చే దాతల నుంచి విరాళాలు స్వీకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని సూచించారు.
కళ్యాణ మస్తు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ ను రూపొందించాలని సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలో ఇప్పుడున్న బీసీ స్టడీ సర్కిళ్లను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్ గా ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, సంబంధిత శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.