Telangana CM seeks President’s appointment to pass 42 pc BC reservation Bills | స్థానిక సంస్థలు అలాగే, విద్య, ఉద్యోగాల కల్పనలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే చట్ట బద్ధత కల్పించాలని రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని విజ్ఞప్తి చేసింది.
ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు.
ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించారు.
స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత మార్చి నెలలో శాసనసభలో ఆమోదించిన రెండు బిల్లులు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు విధించిన గడువు సమీపిస్తుండగా, ప్రస్తుతం బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆగస్టు 5, 6, 7 తేదీల్లో నేరుగా కలిసి విజ్ఞప్తి చేయడానికి వీలుగా గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్‌మెంట్ కోరాలని నిర్ణయించారు. రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఈ విషయంలో అన్ని పార్టీలు సహకరించాలని మంత్రిమండలి కోరింది.









