Telangana BJP chief Ramchander Rao News | నాగర్ కర్నూల్ మండలంలోని కుమ్మెరగట్టు మల్లన్నస్వామి జాతరలో జరిగిన అమానవీయ ఘటనపై స్పందించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు. తెలంగాణలో “మొహబ్బత్ కీ దుకాన్” బదులు “నఫ్రత్ కీ దుకాన్” నడుస్తుందని ధ్వజమెత్తారు. నాగర్‌కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేసిందన్నారు. కుమ్మెరగట్టు మల్లన్న స్వామి జాతర సందర్భంగా శివాలయానికి వెళ్లిన ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన దంపతులపై కాంగ్రెస్‌కు చెందిన సర్పంచ్ దాడి చేశాడన్న ఆరోపణలు వెలువడుతున్నాయని పేర్కొన్నారు.
ఈ దాడిలో జంట శిశువుపై కూడా అమానుషంగా ప్రవర్తించడం అత్యంత ఆందోళనకరం అని అన్నారు. ఈ ఘటనపై సంపూర్ణ స్థాయిలో, పారదర్శకంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. బాధ్యులెవరో తేల్చి, ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ ఓబీసీ హక్కుల గురించి, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతారని మరోవైపు తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ఓబీసీ కుటుంబంపై దాడి జరగడం బాధాకరం అని విమర్శించారు.










