Supreme Court slaps man with Rs 4.54 crore fine for illegal cutting trees | భారీ సంఖ్యలో చెట్లను నరికివేయడం మనుషుల్ని చంపడం కంటే దారుణమని అభిప్రాయం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.
మధుర-బృందావన్ లోని దాల్మియా ఫార్మ్ ప్రైవేట్ భూముల్లో 454 చెట్లను చట్టవిరుద్దంగా నరికివేశారని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 454 చెట్లను నరికివేయడం మూలంగా కోల్పోయిన పచ్చదనాన్ని తీసుకురావాలంటే వందేళ్లు పడుతుందని కోర్టు పేర్కొంది.
నరికివేసిన చెట్లలో 32 రక్షిత అటవీ భూమిలోని రోడ్డు పక్కన ఉన్నాయని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తెలిపింది. ఈ క్రమంలో నరికివేసిన ఒక్కో చెట్టుకు రూ.లక్ష చొప్పున మొత్తంగా రూ.4.54 కోట్ల జరిమానా విధిస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.
అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ అగర్వాల్ తప్పును అంగీకరించారని, అతనిపై విధించిన జరిమానాను తగ్గించాలని న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. కానీ జరిమానాను తగ్గించడానికి కోర్టు నిరాకరించింది. సమీపంలోని స్థలంలో చెట్లను నాటాలని, ఆ తర్వాతే పిటిషన్ ను పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది.